హెచ్‌సీఎల్‌లో 6 నెలల్లో 20 వేల ఉద్యోగాలు
కంపెనీ సీఈవో విజయకుమార్ వెల్లడి

న్యూఢిల్లీ: భారత్ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్నాలజీ వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 20 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయంగా డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తోపాటు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడంతో వచ్చే ఆరు నెలల్లో 20 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు కంపెనీ సీఈవో విజయ కుమార్ వెల్లడించారు. నోయిడా కేంద్రస్థానంగా ఐటీ సేవలందిస్తున్న హెచ్‌సీఎల్.. గతేడాది 10 బిలియన్ డాలర్ల మైలురాయికి చేరుకున్నది. 1,59,682 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గత త్రైమాసికంలో మొత్తంగా 12,422 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుని నికరంగా 6,597 మంది తీసుకున్నది. గడిచిన ఏడాదికాలంలో వలసలు 10.2 శాతంగా ఉన్నాయి. డిమాండ్ దృష్ట్యా ఫ్రెషర్లు, నైపుణ్యం కలిగిన మరో 20 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా విజయ్ కుమార్ వెల్లడించారు.