బంగారు గనిలో ప్రమాదం.. 10 మంది మృతి

బీజింగ్: చైనాలో మైనింగ్ పరిశ్రమలో ప్రమాదాలు తరచూ సంభవిస్తుంటాయి. ఏటా భారీ మొత్తంలో కార్మికులు, అధికారులు అక్కడ మరణిస్తుంటారు. తాజాగా చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని బంగారు గనిలో ప్రమాదం జరిగిన 2 వారాలకు ప్రమాదంలో చిక్కుకున్న వారి వద్దకు చేరుకున్నారు. 14 రోజులపాటు గనిలో చిక్కుకున్న వారిలో 10 మంది మృత్యువాత పడగా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కాగా ఈ ఘటనలో మరొకరి జాడ లభ్యం కాలేదు. అతని ఆచూకీ కోసం నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
కాగా ఈ నెల 10న బంగారు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాద విషయం 30 గంటల తర్వాత అధికారులకు తెలిసింది. కాగా ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు దాదాపు 15 రోజుల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేశారు. ఈ క్రమంలో రెండు వారాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని 25వ తేదీన బయటకు తీసుకొచ్చారు. అయితే అధికారులు చేరుకునేలోపు 10 మంది మరణించగా, మరో 11 మంది ప్రాణాలతో ఉన్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు.