హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం..

హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కోఠి ఆంధ్రాబ్యాంక్ కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంక్ దగ్గరలోని ఓ వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మరో ఐదు దుకాణాలకు మంటలు వ్యాపించాయి. షాపులు మూసివేసి యజమానులు ఇంటికి వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆయా షాపుల్లోని వస్త్రాలు అగ్నికి దగ్ధం అయ్యాయి. ప్రమాదం గురించి తెలుసుకున్న దుకాణ యజమానులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, విపత్తు నిర్వహణ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ అగ్ని ప్రమాదంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దాదాపు గత 40 ఏళ్లుగా బట్టల దుకాణాలు ఏర్పాటు చేసుకొని కోఠీలోనే జీవనం సాగిస్తున్నామని.. అగ్ని ప్రమాదం వల్ల అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.