సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు!: మంత్రి హరీష్
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట పట్టణం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో సోమవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ ఈ సమావేశానికి హాజరైన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పామాయిల్ సాగు వల్ల కలిగే లాభాలను, ప్రయోజనాలను జిల్లాలోని రైతులందరికీ వివరించాలని మంత్రి సూచించారు. ఈ సాగుకు చీడ, పీడల బెడద ఉండదు.. అటవీ జంతువుల బాధలు కూడా ఉండవని చెప్పారు. అంతర పంటలకు సాగుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. ఈ పంటను సాగు చేసే రైతులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందన్నారు. ఈ రెండు పంటల పెంపకంను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముందుకు వచ్చే ప్రజాప్రతినిదులు, రైతులకు ఖమ్మం జిల్లా, కర్ణాటక రాష్ర్టానికి విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీష్ కుమార్, రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.