ఎపి, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల నిర్వహణకుగాను కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. దీనికి సంబంధించి ఈనెల 16న నోటిఫికేషన్ వెలువడుతుందని, మార్చి 14న పోలింగ్ జరుగు తుందని, ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంటుందని వెల్లడించింది. మార్చి 17వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. ఏపీలో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడింది.
కాగా ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఏపీలోని ఉపాధ్యాయ నియోజకవర్గాలైన ఈస్ట్‌గోదావరి-వెస్ట్‌గోదావరి, కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీలు రాముసూర్యారావు, ఏఎస్‌రామకృష్ణ పదవీకాలం సైతం పూర్తికానుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్నికల ప్రక్రియ..
- నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 16 (మంగళవారం)
- నామినేషన్లకు చివరితేదీ : ఫిబ్రవరి 23 (మంగళవారం)
- నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 24 (బుధవారం)
- నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ : ఫిబ్రవరి 26 (శుక్రవారం)
- పోలింగ్: మార్చి 14 (ఆదివారం) ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
- ఓట్ల లెక్కింపు : మార్చి 17 (బుధవారం)