బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం.. 11 మంది దుర్మరణం

చెన్నై: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సత్తూరు సమీపంలోని అచాంకుళం వద్ద బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఘోరం చోటుచేసుకుంది. ఇక్కడి బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుళ్లలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటన భారీగా అగ్ని మాపక సిబ్బంది 5 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్లు విరుదునగర్ కలెక్టర్ ఆర్ కన్నన్ తెలిపారు.
మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రధాని నరేంద్రమోదీ ఈ ఘటన విషాదకరమని ట్విట్టర్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.