వరవరరావుకు బెయిల్ మంజూరు

ముంబయి: విరసం నేత, విప్లవ కవి వరవరరావు (81)కి ఎట్టకేలకు బెయిల్ లభించింది. భీమా కొరేగావ్ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆయనకు సోమవారం బొంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు ఆరు నెలలపాటు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ ఎస్ఎస్ షిండే, మనీశ్ పిటాలేల ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. 2018, ఆగస్టు 28న ఎల్గార్ పరిషత్-భీమా కోరెగావ్ కేసులో అరెస్టయిన వరవరరావు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నాడు. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. అదేవిధంగా కేసు విచారణకు సంబంధించి ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయరాదని, కేసులో సహనిందితులుగా ఉన్నవారితో మాట్లాడవద్దని సూచించింది. ఒకవేళ ఆరు నెలల తర్వాత ఆరోగ్యం మెరుగుపడకపోతే బెయిల్ పొడిగింపు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోర్టు పేర్కొన్నది. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన భర్తకు బెయిల్ ఇవ్వాలన్న వరవరావు భార్య పిటీషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పరిస్థితుల్లో ఆయనను జైలుకు పంపడం సరికాదని భావించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.