ఆ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి: సీఐటీయూ, ఎఐఎఫ్‌టియు నాయ‌కులు

కామారెడ్డి: కార్మికవర్గానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే నాలుగు కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి మున్సిపాలిటీ ముందు గ‌ల అంబేడ్క‌ర్ విగ్రహం ముందు సీఐటీయూ, ఎఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఈ సందర్బంగా యూనియన్ సీఐటీయూ జిల్లా ఉప అధ్యక్షుడు కె.రాజనర్సు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కోడ్ లను తేవడాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం, బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కార్మికుల, రైతుల, సామాన్య ప్రజలపై దాడులు చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కుట్ర దానివెనుక దాగిఉందని ఆరోపించారు. 8 గంటల పని దినానికి తూట్లు పొడిచి 12 గంటల పని విధానం అమల్లోకి తేవడం, సమ్మె హక్కును హరించే విధంగా కార్మిక కోడ్‌లను రూపొదించడం అన్యాయమని పేర్కొన్నారు. నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టానికి సవరణ చేసిందనీ, కార్పొరేట్‌, కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి తెరలేపిందని విమర్శించారు. తక్షణమే కార్మిక వ్యతిరేక కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కె చంద్ర శేఖర్. యండి. మహిబూబ్ అలీ ఎఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షులు అనసూయ జిల్లా కార్యదర్శి నగలక్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.