హైదరాబాద్లో కారు దగ్ధం.. ప్రయాణికులు సురక్షితం
హైదరాబాద్ : నగరంలోని తార్నాక మెట్రో స్టేషన్ వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తు కారుకు మంటలు అంటుకొని దగ్ధమైంది. ఎల్బీ నగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు ప్రయాణికులతో వెళ్తున్న కారులో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును నిలిపి ప్రయాణికులను కిందకు దించాడు. క్షణాల్లో మంటలు పూర్తిగా వ్యాపించి కారు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. నడిరోడ్డుపై కారులో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో సమీపంలోని వాహనదారులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఇంజిన్లో సాంకేతిక సమస్య కారణంగానే కారు దగ్ధమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.