2 గంటల లోపు విమాన ప్రయాణాల్లో నో మీల్స్

న్యూఢిల్లీ : కరోనా నివారణ చర్యల్లో భాగంగా విమాన ప్రయాణ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏప్రిల్ 15 నుండి రెండు గంటల లోపు ప్రయాణించే ప్రయాణికులకు భోజన సేవలను నిలిపివేయాలని పౌరవిమానయాన శాఖ సోమవారం నిర్ణయించింది. వచ్చే గురువారం నుండి ఈ నిషేధం అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
కాగా రెండు గంటల కన్నా ఎక్కువ సేపు విమానాల్లో పయనించే ప్రయాణీకులకు మాత్రమే భోజన సదుపాయాన్ని అందిస్తామని పేర్కొంది. ప్రతి ఒక్కరికీ భోజనం, పానీయాలు సర్వ్ చేసే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా కరోనా మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.