సాగర్ పోరు: 88 శాతానికిపైగా పోలింగ్!

నల్లగొండ: నాగార్జున సాగర్ ఉప్ప ఎన్నిక పోలింగ్లో ఇప్పటివరకు 88 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసినా తుది పోలింగ్ శాతం వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. అన్నిచోట్ల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్ల పోలింగ్ పూర్తవగా.. 6 నుంచి 7 గంటల మధ్య కరోనా బాధితులు ఓటు వేశారు. సాగర్ పోరులో మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది బరిలో నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున నోముల భగత్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ బరిలో నిలిచారు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశముంది. మే 2న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాన్ని ప్రకటిస్తారు.