వ్యాక్సిన్ కొరతను పరిష్కరించాలి: మంత్రి ఈటల

హైదరాబాద్: కొవిడ్ వ్యాక్సిన్ కొరతను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన బీఆర్కే భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉంది.కానీ టీకా అందుబాటులో లేక ఇవాళ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఇవాళ రాత్రికి 2.7 లక్షల డోసులు వస్తాయని సమాచారమిచ్చారు. వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఎంత తొందరగా వ్యాక్సిన్ ఇస్తే పంపిణీ ప్రక్రియ అంత వేగంగా చేపడతామని మంత్రి వివరించారు.
`రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత సమస్యను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ దృష్టికి తీసుకెళ్లాం. టీకా నిల్వలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
సెకండ్ వేవ్‌లో వైరస్ తీవ్రత అధికంగా ఉన్నందున ఆక్సిజన్ సరఫరా విషయంపైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. రాష్ట్రంలో నిత్యం 200 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉంటుంది. కేసులు పెరిగితే 350 టన్నుల వరకు అవసరం ఉండొచ్చు.
ఆక్సిజన్ సరఫరా విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు. ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానల వైద్యులు కరోనా రోగులకు ఐసీఎంఆర్ విధి విధానాలకు అనుగుణంగా వైద్యం అందించాలి.
రోగి పరిస్థితి, అవసరాన్ని బట్టి ఆక్సీజన్ అందించాలి.. ఆక్సీజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత సైతం వైద్యులపై ఉంది. ఆక్సిజన్ అవసరం మేరకు వాడుకోవాలి. కరోనా ఉధృతి తగ్గిన తర్వాత రెమిడెసివీర్ ఇంజెక్షన్ల ఉత్పత్తి తగ్గింది. త్వరలో కావాల్సినన్ని రెమిడెసివర్ ఇంజెక్షన్లు లభిస్తాయి’ అని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.