ఈటల ఆరోపణలు సత్యదూరం: మంత్రి కొప్పుల

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర సమితిలో తనకు గౌరవం, విలువ దక్కలేదంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు సత్యదూరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం మరో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు..
ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈటల రాజేందర్ విమర్శల్లో వాస్తవం లేదు. టీఆర్ఎస్లో తనకు గౌరవం లేదని ఈటల రాజేందర్ చెప్పడం సత్యదూరం. పార్టీలో తొలి నుంచి ఆయనకు ప్రాధాన్యమివ్వడాన్ని తాము కళ్లారా చూశామని చెప్పారు. అసైన్డ్ భూములను వ్యాపారం కోసం కొన్నట్లు ఈటలే స్వయంగా చెప్పారని.. 1995లో పేదలకు ఇచ్చిన ఆ భూములను కొనడం తప్పు అనిపించలేదా?.. అని మంత్రి కొప్పల ఈశ్వర్ ప్రశ్నించారు. ప్రస్తుతం దాదాపు రూ. కోటిన్నర విలువ చేసే భూములను రూ. 6లక్షలకే ఎలా కొన్నారని నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 2003లో ఈటల రాజేందర్ పార్టీలో చేరారు. పార్టీలో ఈటల చేరకముందే ఉద్యమం ఉధృతంగా ఉందన్నారు. ఉద్యమ కాలంలోనూ ఈటలను కేసీఆర్ అన్ని విధాలా గౌరవించి ప్రాధాన్యత ఇచ్చారు అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి మంత్రివర్గంలోనే ఈటలకు చోటు దక్కిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఈటల రాజేందర్‌కు ఏం తక్కువైందో తమకు అర్థం కావడం లేదన్నారు.