ప్రముఖ నిర్మాత బీ.ఏ.రాజు కన్నుమూత

హైదరాబాద్ (CLiC2NEWS): తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్‌ఓ బీఏ రాజు కన్నుమూశారు. బి ఏ రాజు (61) శుక్రవారం రాత్రి 07:56 గంటలకు హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన భార్య ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, కాలమిస్ట్ , దర్శకురాలు కలిదిండి జయ రెండు సంవత్సరాల క్రితం మరణించారు. కాగా బి ఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పి ఆర్ ఓ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన బి. ఏ. రాజు ఆ తరువాత ఆయన ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్ గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేశారు. మహేశ్‌బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు పీఆర్‌ఓగా పని చేశారు. 2003లో ఆయన నిర్మాతగా మారి ఆయన భార్య బీ జయ దర్శకత్వం వహించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. ‘సూపర్ హిట్’ సినీపత్రికను నడిపారు.ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.