AP: అభిమానులను అడ్డుకున్నందుకు పోలీసులపై ఎమ్మెల్సీ తోట ఫైర్

మండపేట (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నలుగురు ఎమ్మెల్సీలు (ఎమ్మెల్సీలుగా లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, రమేష్ యాదవ్) ప్రమాణ స్వీకారం జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ (మంగళవారం) ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి వస్తున్న త్రిమూర్తులుకు రావులపాలెం వద్ద స్థానికులు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 144 సెక్షన్ అమలులో ఉందంటూ జాతీయ రహదారిపైకి రాకుండా అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తోట త్రిమూర్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం సిఐ జానకిరామ్ ను పిలిచి త్రిమూర్తులు హెచ్చరించారు. అనంతరం భారీ ఊరేగింపుతో తోట త్రిమూర్తులు మండపేట బయలుదేరి వెళ్లారు.