కరోనా భయంతో ప్రకాశం జిల్లాలో మహిళ ఆత్మహత్య

ప్రకాశం : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. సామన్యుల మొదలు ధనవంతులు అన్నతేడా లేకుండా అందరు తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటున్నారు. కాగా కరోనా భయంతో ఓ మహిళ కోవిడ్ సెంటర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరులోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాల కోవిడ్ సెంటర్లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. సంతమాగులూరు మండలం, పాతమాగులూరుకు చెందిన సగినాల వీరాంజనేయులు, ఆయన భార్య అంజమ్మ(55)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిద్దరినీ ఈ నెల ఎనిమిదిన టంగుటూరు పరిధిలోని రైజ్ ఇంజినీరింగ్ కళాశాల క్వారంటైన్‌కు తరలించారు. అంజమ్మకు నిమోనియా వ్యాధి ఉంది. దీంతో ఆవిడ తీవ్ర మనోవేధనకు లోనైంది. కలత చెంది తనకు కరోనా తగ్గదేమోనని భయాందోళనకు గురై కళాశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అంజమ్మకు భర్త, కుమారుడు ఉన్నారు.