ఉత్త‌రాఖండ్ కొత్త సిఎంగా పుష్క‌ర్‌సింగ్ ధామి

డెహ్రాడూన్‌ (CLiC2NEWS): ఉత్త‌రాఖండ్ కొత్త ముఖ్య‌మంత్రిగా పుష్క‌ర్‌సింగ్ ధామి ఎన్నిక‌య్యారు. ఈ మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు ఉత్త‌రాఖండ్‌లోని బీజేపీ హెడ్ క్వార్ట‌ర్స్‌లో బీజేపీ శాస‌నస‌భాప‌క్షం స‌మావేశ‌మై ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర‌మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్‌, ఇత‌ర సీనియ‌ర్ బీజేపీ నాయ‌కుల స‌మ‌క్షంలో ఉత్త‌రాఖండ్‌ బీజేఎల్పీ స‌మావేశం జ‌రిగింది. రాజధాని డెహ్రాడూన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో 57 రాష్ట్ర ఎమ్మెల్యేలు ఆయనను ఎంపిక చేశారు. 45 ఏళ్ల పుష్కర్‌ సింగ్‌ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఖతిమా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పుష్కర్‌ సింగ్‌ ధామి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సన్నిహితుడు కావడం గమనార్హం. ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి భగత్‌సింగ్‌ కొష్యారిని ప్రత్యేక డ్యూటీ ఆఫీసర్‌గా అధిష్టానం నియమించింది. మొదట సిఎంగా సత్పాల్‌ రావత్‌, ధన్‌సింగ్‌ రావత్‌ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కేంద్ర పరిశీలకుడుగా ఉన్న నరేంద్ర సింగ్‌ తోమర్‌ , రాష్ట్ర ఇన్‌చార్జ్‌ దుష్యంత్‌ కుమార్‌ గౌతమ్‌ల నేతృత్వంలో జరిగిన సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు పుష్కర్‌ సింగ్‌ ధామి పేరు సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

(త‌ప్ప‌క‌చ‌ద‌వండి:ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రి రాజీనామా)

నిబంధనల ప్రకారం.. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా ఆ వ్యక్తి  శాసనసభ లేదా మండలి సభ్యుడు కావాల్సి ఉంది. ఉత్తరాఖండ్‌కు శాసనమండలి లేదు. దీంతో తీరథ్ కు  మిగిలిన ప్రత్యామ్నాయం.. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నిక కావడమే. నిబంధనల ప్రకారమైతే సెప్టెంబరు 10లోగా ఆయన ఏదో ఒకస్థానం నుంచి పోటీ చేసి శాసనసభకు వెళ్లాలి. కానీ, కరోనా వల్ల ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. దీనికితోడు.. ప్రస్తుత సర్కారు పదవీకాలం 2022 మార్చి 23న ముగియనుంది. ఏడాదిలోపు పదవీకాలం ముగిసే పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్‌ ఏ లోక్‌సభ/అసెంబ్లీ స్థానానికీ ఉప ఎన్నిక నిర్వహించడానికి కుదరదు. మరోవైపు  ఎన్నికల  కమిషన్ కూడా   అనుమతించే పరిస్థితులు లేవు. దాంతో తీర‌థ్‌సింగ్ రావ‌త్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌క‌త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆయన రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు కొత్త ముఖ్య‌మంత్రిగా పుష్క‌ర్‌సింగ్ ధామిని ఎన్నుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.