AP: `ఇసుక`పై మాట్లాడే నైతిక హక్కు టిడిపికి లేదు: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

మండపేట (CLiC2NEWS): ఇసుకపై ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. కేపీ రోడ్డులో ఉన్న వైసీపీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎమ్మెల్యే వేగుళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దోచేస్తున్నారని అభియోగం చేయడంపై ఆయన వివరణ ఇచ్చారు. కపిలేశ్వరపురం మండలం నారాయణ లంక గ్రామంలో ఇసుక రవాణాపై జోగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు, తెలుగుదేశం కార్యకర్తలతో చేస్తున్న హడావుడి చూస్తుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు.

గతంలో కోరుమిల్లి గ్రామంలో ఇసుక కోసం నిరోధించిన మహిళలను ఇంట్లోకి వెళ్లి, వారిపై లాఠీఛార్జ్ చేసి దాదాపు 100 మంది మహిళల పై అక్రమ కేసులు పెట్టించిన జోగేశ్వరరావును ప్రజలు ఇంకా మర్చిపోలేదు అన్నారు. మహిళలను అక్రమంగా నిరోధించి వారిపై అక్రమ కేసులు పెట్టిన వేగుళ్ళ జోగేశ్వరరావు ఇసుక రవాణాపై మాట్లాడటం ఆయనకు సబబు కాదన్నారు.

అమలాపురం రూరల్ మండలం తాండవపల్లి గ్రామంలో బలహీనవర్గాల గృహ నిర్మాణం కోసం సేకరించిన వంద ఎకరాలకు మట్టిని రీఫిల్లింగ్ చేయడానికి ప్రభుత్వ అనుమతులతో అనగా మైనింగ్ శాఖ, జిల్లా కలెక్టర్ వారి అనుమతులతో మట్టిని సేకరించడం జరుగుతుందన్నారు.

అది తెలుసుకోకుండా జోగేశ్వరరావు అక్రమ రవాణా అంటూ వైసీపీ నేతల హస్తం ఉందంటూ అసందర్భ ప్రేలాపనలు పేలడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇసుక, మట్టి తెలుగుదేశం కాలంలో ఎవరు తిన్నారో మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునన్నారు.

ఇసుక రీచ్ లను గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగిస్తే నీవు వారి పేరుమీద ఇసుకను దోచుకుని కోట్లాది రూపాయలు సంపాదించారని విమర్శించారు. మీరు చేసిన దురాగతాలు అందరికీ విధితమేనని వీటిపై మాట్లాడే నైతిక హక్కు లేదని తోట త్రిమూర్తులు ఉద్ఘాటించారు. లంక గ్రామాల ప్రజలకు ఎటువంటి నష్టం లేకుండా చూసే బాధ్యత తనదేనని తాను మీరు  వెళ్ళక ముందే తాను ఆ గ్రామాలకు వెళ్లే ప్రజలకు విషయాలను వివరించడం జరిగిందన్నారు. ఇకనైనా గతం గుర్తు చేసుకొని సంభాషిస్తే మంచిదని ఎమ్మెల్యే వేగుళ్లకు ఆయన హితవు పలికారు.

Leave A Reply

Your email address will not be published.