వాగులో కొట్టుకుపోయిన కారు ఘటనలో 3 మృతదేహాల గుర్తింపు
వికారాబాద్ (CLiC2NEWS): వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో తిమ్మాపూర్ వాగు దాటుతుండగా దాని ఉధృతికి కారులో కొట్టుకుపోయిన పెళ్లిబృందం కారు లభించింది. అందులో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్రుతి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి మృతదేహాలు లభించాయి. కనిపించకుండా పోయిన ఇషాంత్ రెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
జరిగిందేమిటంటే..
మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డి, మోమిన్‌పేట మండలానికి చెందిన సిగిడి దర్శన్ రెడ్డి కుమార్తె ప్రవల్లికతో ఈ నెల 26న వివాహం జరిగింది. ఒడిబియ్యం పోసుకోవడానికి మోమిన్‌పేటకు వెళ్లి వస్తుండగా ఆదివారం రాత్రి తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. రోడ్డుపై నీరు పారుతుండగా వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు. వాళ్లు ప్రయాణిస్తున్న కారులో నూతన దంపతులతో పాటు పెళ్లి కుమారుడి అక్కలు రాధమ్మ, శ్రుతి, ఓ బాలుడు, మరో బంధువు రాఘవేందర్‌రెడ్డి ఉన్నారు. పెళ్లి కుమారుడు నవాజ్‌రెడ్డి, అతని అక్క రాధమ్మలు కారు డోర్ తెరిచి కాలువలోకి దూకారు. వారిని స్థానికులు ఒడ్డుకు చేర్చారు.