యాదాద్రి టెంపుల్ సిటీలో 250 కాటేజీలు
250 cottages in Yadadri Temple City
హైదరాబాద్ (CLiC2NEWS): యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సిటీలో 2 కోట్లతో ఒక్కో కాటేజీ చొప్పున దాతల సాయంతో 250 కాటేజీలను నిర్మిస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ తెలిపారు. మంగళవారం యాదాద్రి లో పర్యటించిన అనంతరం సాయంత్రం సిఎం మీడియాతో మాట్లాడారు. 900-1000 ఎకరాల స్థలాన్ని సేకరించి టెంపుల్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రసిద్ధ వ్యక్తులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వ్యక్తులు, గవర్నర్లు, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు యాదాద్రికి వస్తే కూడా స్వామివారిని దర్శించి ఇక్కడ ఒకటి-రెండు రోజులు ఇక్కడ ఉండే విధంగా 13 ఎకరాల స్థలంలో రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. అలాగే ఇక్కడ 1500 మంది భక్తులు ఉండేలా ధర్మశాలలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే కాటేజీల నిర్మాణానికి కొందరు దాతలు రూ.50 లక్షలు, రూ.25 లక్షల వరకు పెడుతామంటున్నారని.. వాళ్లకు కూడా స్థలం కేటాయిస్తామని సిఎం తెలిపారు.