బైక్‌, ఆటో ఢీ.. ఒకరు మృతి

మెదక్‌ (CLiC2NEWS): జిల్లాలో నిజాంపేటలో బైక్‌, ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందాడు. ఈ ప్ర‌మాదం లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నిజాంపేట గ్రామ శివారులో మంగళవారం ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

స్థానిక ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్‌ తెలిపిన వివరాల మేర‌కు.. నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని హాబీబ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ జానీ(18) ఆటో నడుపుతూ సిద్దిపేట నుంచి నిజాంపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్‌గౌడ్‌, సయ్యద్‌ రఫీక్‌ నిజాంపేట నుంచి సిద్దిపేట వైపు బైక్‌పై వెళ్తున్నారు. నిజాంపేట గ్రామ శివారులోఆటో నడుపుతున్న సయ్యద్‌ జానీ రాంగ్‌ రూట్‌లో వెళ్లి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు.

ఈ ఘ‌ట‌న‌లో గాయపడిన వారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కాగా తీవ్రగాయాల పాలైన సయ్యద్‌ జానీ చికిత్స పొందుతూ ఆసుప‌త్రిలో మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.