కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను సాధిద్దాంః మంత్రి అల్లోల 

నిర్మ‌ల్ః స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ తొలి, మలి ఉద్యమ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి సందర్బంగా  జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కూడలిలో ఆయన విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అధికారులు, నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ,  తెలంగాణ విముక్తికి అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని  అన్నారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులకు  కొండంత అండగా నిలిచి స్ఫూర్తినిచ్చిన  ఉద్యమ నాయకుడని కొనియాడారు. న్యాయవాదిగా, శాసన సభ్యుడిగా, మంత్రిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా బాపూజీ సేవలు మరువరానివని ప్రశంసించారు. ఆయన జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో బాపూజీ చిత్ర పటానికి మంత్రి, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, అధికారులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.