9న పోలింగ్‌, 12న ఓట్ల లెక్కింపు

ఎమ్మెల్సీ ఎన్నిక స‌మ‌క్ష‌లో నిజామాబాద్ క‌లెక్ట‌ర్‌

నిజామాబాద్ః నిజామాబాదు స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. సోమవారం నాడు తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 9 న పోలింగ్, 12న లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఓటు వేయడానికి అర్హత ఉన్న ఓటర్లు అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఓటర్లు బ్యాలెట్ ద్వారా తమ ఓటింగ్ వినియోగించుకోవచ్చని, లేదా పోలింగ్ చివరి గంటలో అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూచా తప్పకుండా పాటించాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా సభలు, సమావేశాలు రాజకీయ పార్టీలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని చెప్పారు. అభ్యర్థులు తనతో పాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని చేసుకోవచ్చని, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ప్రలోభాలు పెట్టవద్దని సూచించారు. ఓటర్లు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలో 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని రాజకీయ పార్టీలు తమకు సహకరించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డి, తహసీల్దార్ అమీన్ సింగ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిట్టు వేణుగోపాల్, ముప్పరపు ఆనంద్, కైలాస్ శ్రీనివాసరావు, గంగాధర్, కాశీంఅలీ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.