స్పీడు 40 కి.మీ. మాత్రమే!
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై వాహనాలకు అనుమతి
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువుపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మంచిన తీగల వంతెనపై వాహనాల రాకపోకలకు అధికారులు అనుమతించారు. అయితే బ్రిడ్జిపై 40 కి.మీ. కంటే వేగంగా వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ పోలీసులు సూచికలు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పరిశీలిస్తున్నారు. వంతెనపై పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహానాలకు చలానా విధిస్తున్నారు. కాగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో సంతోషిస్తున్న నగరవాసులు వంతెనపై వాహనాలు ఆపి ఫొటోలు దిగుతున్నారు. చాలా మంది ఆ వంతెన అందాలు చూడటానికి ఉత్సుకత చూపిస్తున్నారు. చారిత్రక హైదరాబాద్ నగరానికి మరింత అందం చేకూర్చేలా దుర్గం చెరువుపై అత్యాధునిక పరిజ్ఞానంతో కేబుల్ బ్రిడ్జిని రాష్ట్రప్రభుత్వం నిర్మించింది. రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ తీగల వంతెనను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సెప్టెంబర్ 25న ప్రారంభించిన విషయం తెలిసిందే.