మార్చి నాటికి ఓఆర్ఆర్‌లోని 272 కాల‌నీల‌కు మంచినీటి స‌ర‌ఫ‌రా

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ఓఆర్ఆర్ ప‌రిధిలోని గ్రామ పంచాయ‌తీలు, మున్సిపాలిటీలు, మున్సిప‌ల్‌ కార్పొరేష‌న్లు, వీటి ప‌రిధిలోని గృహ లేఅవుట్లు, గేటెడ్ క‌మ్యూనిటీల‌కు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్ల‌తో చేప‌ట్టిన‌ ఓఆర్ఆర్ – 2 ప‌నుల‌ను వేగవంతం చేయాల‌ని జ‌లమండ‌లి ఎండీ దాన‌కిశోర్ ఆదేశించారు. గురువారం ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఉన్న‌తాధికారులు, నిర్మాణ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో ఓఆర్ఆర్ – 2 ప‌నుల‌పై ఆయ‌న‌ స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఎండీ దాన‌కిశోర్‌ మాట్లాడుతూ… ఓఆర్ఆర్ – 2లో 2,863 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్ వేయ‌నుండ‌గా, ఇందులో ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి సుమారు 535 కిలోమీట‌ర్ల పైప్‌లైన్ పూర్తి చేస్తామ‌ని తెలిపారు. ఇందుకోసం వెంట‌నే అవ‌స‌ర‌మైన ఫీడ‌ర్ మెయిన్‌, పైప్‌లైన్‌కి ఆర్డ‌ర్ ఇవ్వాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. మొద‌ట‌గా ఈ కొత్త‌ పైప్‌లైన్ ద్వారా ఈ  మార్చి చివ‌రి నాటికి 272 కాల‌నీల్లోని ప్ర‌జ‌ల‌కు నీటి స‌ర‌ఫ‌రా చేయాల‌నే ల‌క్ష్యంతో ప‌ని చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఓఆర్ఆర్ – 2 మొద‌టి ఫ‌లాల‌ను ఈ వేసవిలోనే ప్ర‌జ‌లకు అందిస్తామ‌న్నారు.

ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణం ప్రారంభం

ఓఆర్ఆర్ – 2 ప‌నుల‌ను వేగ‌వంతంగా పూర్తి చేసేందుకు ప్ర‌ణాళికబ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని జ‌ల‌మండ‌లి ఎండీ దాన‌కిశోర్.. అధికారుల‌ను ఆదేశించారు. ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో క‌నీసం 50 శాతం రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణ ప‌నులు క‌చ్చితంగా ప్రారంభం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వారం రోజుల్లో రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణానికి సాయిల్ టెస్టు పూర్తి చేయాల‌ని పేర్కొన్నారు. ఈ నెలాఖ‌రు లోపు డిజైన్ల‌ను పూర్తి చేయాల‌ని సూచించారు. రిజ‌ర్వాయ‌ర్ల  నిర్మాణం కోసం మెన్‌, మెషిన‌రీ, మెటీరియ‌ల్‌ను సిద్ధం చేసుకోవాల‌ని పేర్కొన్నారు. ఈ ఏడాది చివ‌రి నాటికి క‌చ్చితంగా అన్ని రిజ‌ర్వాయ‌ర్ల నిర్మాణం పూర్తి చేసేలా ప్ర‌ణాళిక ఉండాల‌న్నారు.

ఓఆర్ఆర్ – 2 ప్రాజెక్టు స్వ‌రూపం

ఓఆర్ఆర్ ప‌రిధిలోని గ్రామ పంచాయ‌తీలు, మున్సిపాలిటీలు, మున్సిప‌ల్‌ కార్పొరేష‌న్లు, వీటి ప‌రిధిలోని గృహ లేఅవుట్లు, గేటెడ్ క‌మ్యూనిటీల‌కు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్ల‌తో ఓఆర్ఆర్ – 2 ప్రాజెక్టు చేప‌ట్టారు. కొత్త‌గా 137 మిలియ‌న్ లీట‌ర్ల సామ‌ర్థ్యంతో రిజ‌ర్వాయ‌ర్లు ఏర్పాటుచేయ‌డం, ఇన్‌లెట్లు, అవుట్‌లెట్ల‌ను, 2,863 కిలోమీట‌ర్ల నూత‌న పైప్‌లైన్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డం, బీపీఎల్ కుటుంబాల‌కు న‌ల్లా క‌నెక్ష‌న్లు ఇవ్వ‌డం, క్లోరినేష‌న్ రూంల‌ను నిర్మించ‌డం, పైప్‌లైన్లు వేయడానికి త‌వ్విన రోడ్ల‌ను పున‌రుద్ధ‌రించ‌డం, వంటి ప‌నుల‌తో ఓఆర్ఆర్ ఫేజ్ – 2 ప్రాజెక్టుకు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. ప్ర‌స్తుత అవ‌స‌రాలే కాకుండా భ‌విష్య‌త్ అవ‌స‌రాలకు కూడా స‌రిపోయేలా ఈ మొత్తం ప్రాజెక్టు రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. 2036 నాటికి ఈ ప్రాంతాల్లో జ‌నాభా సంఖ్య 33.92 ల‌క్ష‌లకు పెర‌గ‌నుంద‌ని అంచ‌నా వేసి, పెరిగే జ‌నాభాకు స‌రిప‌డా నీటిని అందించే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తైతే ఓఆర్ఆర్ ప‌రిధిలో కొత్త‌గా 2 ల‌క్ష‌ల కుటుంబాల‌కు మంచినీటి న‌ల్లా క‌నెక్ష‌న్లు రానున్నాయి. సుమారు 20 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందుతుంది. ఇప్ప‌టికే ఉన్న‌ 1.5 ల‌క్ష‌ల న‌ల్లా క‌నెక్ష‌న్ల‌కు స‌రిప‌డా నీరు అందుతుంది.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌ల‌మండ‌లి ఈడీ డా.ఎం.స‌త్య‌నారాయ‌ణ‌, టెక్నిక‌ల్ డైరెక్ట‌ర్ ర‌వి కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.