ఇంకెంత కాలం నిర్భంధిస్తారు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని ”ఇంకా ఎంతకాలం ముఫ్తీని నిర్బంధంలో ఉంచుతారు” అని జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం జమ్ముకాశ్మీర్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముఫ్తీ నిర్బంధాన్ని సవాలు చేస్తూ.. ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచార‌ణ‌లో భాగంగా ముఫ్తీని నిర్బంధించడంపై ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటని ప్రశ్నించారు. ఆమెను ఎంతకాలం అదుపులో ఉంచవచ్చు, ఆమె కస్టడీని ఒక సంవత్సరానికి మించి పొడిగించవచ్చా అనే అంశంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కాగా, కేసు ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆమె నిర్బంధ సమయం దాటిపోయిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సమయంలో కేంద్రం పలువురు నేతలను నిర్బంధించిన సంగతి తెలిసిందే. అనంతరం వారిపై ప్రజాభద్రతా చట్టం (పిఎస్‌ఎ) ప్రయోగించింది. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) నేత అయిన మెహబూబా ముఫ్తీకి కూడా ఇదే చట్టం కింద జులైలో నిర్బంధాన్ని మరో మూడు నెలల పాటు కేంద్రం పొడిగించింది.

Leave A Reply

Your email address will not be published.