అక్రమ నల్లా కనెక్షన్ కలిగి ఉన్న వ్యక్తిపై క్రిమినల్ కేసు

హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ – 6లోని ఫతేనగర్ సెక్షన్ పరిధిలో గల ఎస్ఆర్ నగర్‌లోని ఆదిత్యనగర్‌లో నివసించే జి.భద్రయ్య అనే వ్యక్తి నివాసానికి గతంలో 15 ఎంఎం నల్లా కనెక్షన్ ఉండేది. తర్వాత ఈ కనెక్షన్‌ను జలమండలి తొలగించింది. అయితే, తొలగించిన నల్లా కనెక్షన్‌ను భద్రయ్య అక్రమంగా తిరిగి తీసుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన జలమండలి విజిలెన్స్ విభాగం అక్రమ కనెక్షన్‌ను తొలగించింది. అక్రమ నల్లా కనెక్షన్ కలిగి ఉన్న భద్రయ్యపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో యు/ఎస్ 269, 430 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అధికారుల అనుమతులు లేకుండా అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమంగా నల్లా కనెక్షన్లు తీసుకునే యాజమానితో పాటు కనెక్షన్‌కు సహకరించిన ప్లంబర్, ఇతర వ్యక్తులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించిన, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే జలమండలి విజిలెన్స్ బృందానికి లేదా 9989998100, 9989992268 నెంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరు.