జలమండలి మేనేజర్లకు ఓరియెంటేషన్ శిక్షణా కార్యక్రమాలు..

హైద‌రాబాద్(CLiC2NEWS): జలమండలిలో గత సంవత్సరంలో ఎంపికైన‌ మేనేజర్లకు ఓరియెంటేషన్ శిక్షణా కార్యక్రమాన్ని మంగళవరం రోజు గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా లో ఎండీ  ఎం. దాన కిషోర్, ఐఏఎస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జలమండలిలో వివిధ విభాగాల పనితీరుపై ఆయన వివరించి చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాగు నీరు అందించడం అంటే ప్రజలకు సేవ చేసే అదృష్టంగా భావించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ వద్దకు వచ్చిన సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని తెలిపారు. అత్యంత బాధ్య‌త‌తో కష్టపడి విధులు నిర్వ‌ర్తిస్తూ బోర్డుకు మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ శిక్షణా కార్యక్రమాన్ని నేటి నుండి ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ ఓరియెంటేషన్ శిక్షణలో భాగంగా.. మేనేజర్లకు తాగునీరు, మురుగు నీటి శుద్ధి, ప్రాజెక్టులు,ఫైనాన్స్, ప‌ర్స‌న‌ల్, ఎన్ఆర్ డ‌బ్య్లూ (నాన్ రెవెన్యూ వాట‌ర్), క‌ష్ట‌మ‌ర్ కేర్, సీడాక్, ట్రాన్స్మిష‌న్, తాగు నీటి శుద్ధి వంటి తదితర అంశాలపై మేనేజ‌ర్ల‌కు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వర్ రావు, వాటర్ రిసోర్సు డిపార్ట్మెంట్ హెచ్ఓడి రాజశేఖర్ రెడ్డి, జలమండలి సీజీఎమ్ (పి&ఏ) అబ్దుల్ ఖాదర్, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.