జంగా, పొన్నాల వర్గీయుల బాహాబాహీ

జనగామ: గాంధీ జయంతి రోజున జనగామ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కొంతకాలంగా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. గాంధీ జయంతిని పురస్కరించుకుని పీసీసీ పిలుపు మేరకు కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో శుక్రవారం చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెంబర్తి కమాన్ వద్ద ఆయనకు స్వాగతం పలికే సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోటాపోటీగా నినాదాలు చేయడంతో మాటామాటా పెరిగి రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. శ్రవణ్‌కుమార్ సాక్షిగా ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. గల్లాలు పట్టుకుని ఒకరినొకరు నెట్టివేసుకుంటూ బూతులు తిట్టుకున్నారు. ఒక దశలో కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ హఠాత్ పరిణామాన్ని దాసోజుతో పాటు అక్కడున్న వారు చూసి నిశ్చేష్టులయ్యారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది.