పాలకుర్తి సమగ్ర అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు: మంత్రి ఎర్రబెల్లి
సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి

పాలకుర్తి (CLiC2NEWS): జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తిలో శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అంతకు ముందు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాలయంలో నూతనంగా నిర్మించిన మహా మండపాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం పాలకుర్తిలో 1 కోటి 14 లక్షల రూపాయల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ప్రణాళిక నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టూరిజం ప్యాకేజీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా దేవస్థాన గర్భగుడి, మండప పునరుద్ధరణకు కోటి రూపాయల వ్యయం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం అయిన పాలకుర్తి గ్రామ సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రత్యేక ప్రణాళిక నిధుల నుండి మంజూరైన 21 కోట్ల 24 లక్షల రూపాయల వ్యయంతో పాలకుర్తి లో జంక్షన్ అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఆయన తెలిపారు. దీనికి తోడుగా పాలకుర్తి – వరంగల్ కు, పాలకుర్తి – జనగామ, పాలకుర్తి – తిరుమలగిరి, పాలకుర్తి – తొర్రూరు తారు రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో తారు రోడ్డు సౌకర్యానికి వంద కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు ఆయన తెలిపారు.
ఒక వైపు శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన అభివృద్ధితో పాటుగా వల్మీడి సీతారామ స్వామి దేవస్థాన అభివృద్ధికి, బొమ్మెర పోతన స్మారక మందిర అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన తెలిపారు.
బొమ్మెర గ్రామంలో బొమ్మెర పోతన మందిరం, ఇతర అభివృద్ధి పనులకు 10 కోట్లు వ్యయం చేయ్యనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా వల్మీడి సీతారామ స్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు 8 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుస్కురి శ్రీనివాస్ రావు, ఎంపిపి నాగిరెడ్డి, సర్పంచ్ యాకాంత రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, దేవస్థాన కమిటీ చైర్మన్ రాం చంద్రయ్య శర్మ తదితరులు పాల్గొన్నారు.