వేసవిలో తొలి ఆదివారం పియా బీచ్ లో..
న్యూజిలాండ్ లో వేసవి ప్రారంభమైంది.. అక్టోబర్ లో ఇక్కడ వేసవి ప్రారంభం. మార్చ్ వరకు ఉంటుంది.. కరోనా వలన ఎక్కడికి వెళ్లకుండా. ఇంటి వద్దనే వుండవలసి వచ్చింది.. కానీ మామ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని పిల్లలు అనుకుంటున్నారు.. కానీ మూడు జాగ్రత్త చర్యగా.. ఇంటివద్ద ఉంటేనే క్షేమం అన్న కారణంగా ఎక్కడికీ వెళ్ళలేదు.. ఇక వేసవి వచ్చిన మొదటి ఆదివారం.. బీచ్ కు వెళ్లాలని నిర్ణయించు కున్నారు.. ఇది ఒక ద్వీపం కాబట్టి చుట్టూ బీచ్ లతో నిండి ఉంటుంది. కొద్హి దూరం లాంగ్ డ్రైవ్ చేసి వెళ్లాలని పియా బీచ్ కు రెండు కార్ లలో బయలు దేరాం.
ప్రశాంతమైన వాతావరణం.. రోడ్డు కు ఇరువైపులా దట్టమైన చెట్లు.. ఒక్కోసారి నల్లమల అడవుల్లో నుంచి వెళుతున్నామా అనిపిస్తే మరో సారి తిరుమల ఘాట్ రోడ్ లా అనిపించింది. అందమైన లోయలు, రోడ్ కు ఇరువైపులా పూల చెట్లు.. దాటుకుంటూ వెళ్ళాం. రోడ్ పైన మనం కార్ లో ఏ వేగం తో వెళ్లాలో బోర్డు లు ఉంటాయి.. 25, 45, 70, 100కిలో మీటర్ల వేగం తో వెళ్ళ వచ్చు. సరే ఇంటి నుంచి బయలు దేరిన గంట సేపటికి బీచ్ కు చేరుకున్నాం. పిల్లలు కేరింతలు కొట్టారు.. ఇద్దరు మనవరాళ్లు ఇసుకలో పరుగులు తీశారు. ఇసుక చేతిలోకి తీసుకుని కాసేపు ఆడారు.. ఆద్య ఇసుకలో పేర్లు రాసి ఆనందించింది.. నీటిలోకి పరుగులు తీయడం తో నీటితోనూ ఆనందం తోనూ తడిసి ముద్దయ్యారు..
చుట్టూ కొండలు.. మధ్యలో సముద్రం. సూర్యాస్తమయ సమయం కావడం తో ఆకాశం ఎరుపుగా మారింది.. ఇక్కడ వేసవిలో సూర్యుడు రాత్రి తొమ్మిది వరకు కనిపిస్తాడు.. ఇదే ప్రారంభం కాబట్టి ఏడున్నర వరకు కనిపించాడు. ఇంకా చలి గాలులు వీస్తుండటం తో ఇంటి ముఖం పట్టాం. .
దారిలో దక్షిణ భారతీయ రెస్టారెంట్ వుంది.. పేరు పాపడం కానీ అందులో సీట్లు లేక పోవడం తో డెన్నిస్ రెస్టారెంట్ కు వెళ్లి సాయంకాల భోజనం ముగించుకుని ఇంటికి చేరుకున్నాం. పిల్లలు అలసి పోయారు.. మాకూ కాస్త ఆటవిడుపు లా అనిపించింది. చాల రోజుల తరువాత ఈ ఆనందాన్ని చవి చూసాం.
–టి.వేదాంత సూరి