ఓఆర్ఆర్ – 2 పనుల వేగం పెంచాలి: జలమండలి ఎండీ దానకిశోర్
ఈ వేసవిలోనే మొదటి ప్రాధాన్యత ప్రాంతాలకు నీటి సరఫరా

హైదరాబాద్ (CLiC2NEWS): ఓఆర్ఆర్ – 2 పనులను జలమండలి ఎండీ దానకిశోర్ పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ – 2లో భాగంగా ప్యాకేజి-2లో నగర శివార్లలోని కిస్మత్‌పూర్, బైరాగిగూడ, గంధంగూడ, గండిపేట ప్రాంతాల్లో జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు. కిస్మత్‌పూర్, బైరాగిగూడ రిజర్వాయర్ నిర్మాణ పనులను, శివసాయి కాలనీలో పైప్‌లైన్ విస్తరణ పనులను, వెంకటేశ్వర కాలనీ(గంధంగూడ), బృందావన్ కాలనీ, గండిపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద నిర్మాణ దశలో ఉన్న రిజర్వాయర్లను పరిశీలించారు. శివసాయి కాలనీ దగ్గర పైప్‌లైన్ విస్తరణ పనులను పరిశీలించి పైపుల జాయింటింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్యాకేజీ – 2లో మొదటి ప్రాధాన్యత కింద నిర్ణయించిన 73 కాలనీల్లో 116.7 కిలోమీటర్ల పైప్‌లైన్ విస్తరణ పనులను మార్చి 31 నాటికి పూర్తి చేసి ఏప్రిల్ రెండో వారంలో మంచినీటి సరఫరా ప్రారంభించాలని సూచించారు. నిర్మాణ దశలో ఉన్న రిజర్వాయర్ల వద్ద తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, బారీకేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, రిజర్వాయర్లతో పాటు పైప్‌లైన్ విస్తరణ పనుల కోసం సరిపడా పైపులు, స్పెషళ్లు, యంత్రాలు, సరిపడా కార్మికులు ఉండేలా చూసుకోవాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు. అలాగే, రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్ రూమ్, జలమండలి మేనేజర్‌కు సెక్షన్ ఆఫీస్ నిర్మించడానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, గ్రామ పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్మూనిటీలకు మంచినీటిని అందించేందుకు రూ.1,200 కోట్లతో ఓఆర్ఆర్ ప్రాజెక్టు – 2 పనులను జలమండలి చేపట్టింది. ప్యాకేజీ – 1లో రూ.613 కోట్లు, ప్యాకేజ్ -2 కింద రూ.587 కోట్లతో జలమండలి ఈ పనులు చేపట్టింది.
ప్యాకేజీ – 2లో మొత్తం 71.5 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 38 రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు 1293 కిలోమీటర్ల పైప్‌లైన్ విస్తరణ జరుగుతోంది. రాజేంద్రనగర్, పటాన్‌చెరువు, బొల్లారం, ఆర్సీపురం, కుత్బుల్లాపూర్, షామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లో ప్యాకేజ్ – 2 పనులు జరుగుతున్నాయి. ప్యాకేజి – 2 పనులు పూర్తైతే కొత్తగా 83,270 ఇళ్లకు నల్లా కనెక్షన్ అందనుంది. ఇందులో మొదటి ప్రాధాన్యతగా ఏప్రిల్ రెండో వారంలో 73 కాలనీలకు మంచినీటిని అందించాలని జలమండలి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 116.7 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మిస్తోంది.
ఈ కార్యక్రమంలో టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఓఆర్ఆర్ ప్రాజెక్టు సీజీఎం టీవీ శ్రీధర్, జీఎంలు, డీజీఎంలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.