బీజేపీలో చేరిన షూటర్ శ్రేయాసి సింగ్
పట్నా: ప్రముఖ షూటర్ శ్రేయాసి సింగ్ ఆదివారం బీజేపీ పార్టీలో చేరారు. జుముయ్ జిల్లా గిధౌర్‌కు చెందిన శ్రేయాసి సింగ్‌ను బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అమర్‌పూర్ నుంచి బీజేపీ బరిలో దింపవచ్చని భావిస్తున్నారు. 2018లో షూటింగ్ విభాగంలో ఆమె అర్జున అవార్డును పొందారు. ఆమె 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం, స్కాట్లాండ్‌లో జరిగిన 2014 కామన్‌వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించారు. 2013లో మెక్సికోలో జరిగిన ట్రాప్ షూటింగ్ వరల్డ్ కప్‌లోనూ శ్రేయాసి సింగ్ భారత జట్టు తరపున ప్రాతినిథ్యం వహించారు.
శ్రేయాసి తండ్రి దిగ్విజయ్ సింగ్ గతంలో అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ కేబినెట్‌లో పలు మంత్రిత్వ శాఖలను చేపట్టారు. అటల్ బిహార్ వాజ్‌పేయి ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. శ్రేయాసి సింగ్ తల్లి పుతుల్ సింగ్ బిహార్‌లోని బంకా నుంచి ఎంపీగా పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహించారు. శ్రేయాసి గతంలో ఆర్జేడీ సహా పలు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరిపినా చివరికి బిహార్ అసెంబ్లీ ఎన్నికలు మరో నెలలో జరగనుండగా బీజేపీలో చేరాలని ఆమె నిర్ణయించుకున్నారు