నీటిని సంరక్షించుకోవడంలో మహిళలదే కీలకపాత్ర
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణం, వాటి నిర్వహణపై నాంపల్లిలోని సరోజినీ నాయుడు వనిత మహావిద్యాలయం ఆడిటోరియంలో సేవ్ ఎర్త్ ఫౌండేషన్(ఎన్జీవో) ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జలమండలి ఎండీ దానకిశోర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి వనరులను కాపాడుకొని ముందు తరాలకు అందించడానికి విద్యార్థులే జలనాయకులుగా మారాలని పేర్కొన్నారు. సృష్టిలో మహిళలకు కరుణ, దయ, ప్రకృతిపై ప్రేమ ఎక్కువగా ఉంటాయని, కాబట్టి నీటి సంరక్షణలో మహిళలు కీలకపాత్ర పోషించాలని పేర్కొన్నారు. నీటి విలువ, నీరు లేకుపోతే ఉండే ఇబ్బందులు కూడా మహిళలకే ఎక్కువ తెలుసని, కాబట్టి, నీటిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించే బాధ్యతను మహిళలు నిర్వర్తించాలని కోరారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టడానికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ప్రపంచంలో చాలాదేశాలు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇందులో భారతదేశం కూడా ఒకటని పేర్కొన్నారు. అయినప్పటికీ, మన దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీటి సరఫరా బాగున్న వాటిలో హైదరాబాద్ నగరం ప్రధానమైనదని, గోదావరి, కృష్ణ నదుల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో మంచినీటిని సేకరించి, శుద్ధి చేసి నగరవాసులకు జలమండలి సరఫరా చేస్తోందన్నారు. ఇందుకోసం జలమండలి ఎన్నో వ్యయప్రయాసలు పడుతోందన్నారు. అయితే, కొంతమంది మాత్రం అవగాహనారాహిత్యంతో నీటిని వృథా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నీటి ఇబ్బందులు వస్తాయనే అవగాహన కూడా చాలామందిలో లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు నీటిని సంరక్షించుకోకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. అమూల్యమైన నీటిని గృహావసరాలకు వినియోగించుకున్న తర్వాత ఉన్న సాంకేతికతతో శుద్ధి చేసి, ఆ నీటినే నిర్మాణ, గార్డెనింగ్ వంటి ఇతర అవసరాలకు కూడా ఉపయోగించడానికి ప్రయత్నించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వాటర్ రిసోర్సెస్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ వి.ప్రకాశ్, ఎగ్జిబిషన్ సొసైటీ ఛైర్మన్ మరియు కార్యదర్శి ఆదిత్య మార్గం, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఛైర్మన్ టి.సురేందర్, డైరెక్టర్ కిరణ్ కుమార్, కాలేజి ప్రిన్సిపల్ శోభన దేశ్పాండే, జలమండలి ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జలమండలి ఆధ్వర్యంలో 10 రోజుల పాటు కార్యక్రమాలు
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా 10 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, ఇంకుడు గుంతల వద్ద శ్రమదానం నిర్వహించాలని జలమండలి నిర్ణయించింది. ఈ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 19 జలమండలి డివిజన్లలో 19 ఎన్జీవోల భాగస్వామ్యంతో ప్రతి సెక్షన్, డివిజన్, సర్కిల్ పరిధిలో ఇంకుడు గుంతల నిర్మాణం, వాటి నిర్వహణ, నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు మరో పది రోజుల పాటు విస్తృతంగా కొనసాగుతాయి. ఈ కార్యక్రమాల్లో జలమండలి అధికారులు, ఉద్యోగులు, ఎన్జీవో కార్యకర్తలు, స్థానిక రాజకీయ నాయకులు, ప్రజలు శ్రమదానంతో ఇంకుడు గుంతల నిర్వహణ పనులు చేపడతారు.