ఆక్సిజన్ లెవల్స్ తగ్గినా.. వివాదంలో ట్రంప్ విహారం

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన చర్యతో వివాదంలో ఇరుక్కున్నారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకి, ప్రస్తుతం వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ ఆసుపత్రి వెలుపలకు వచ్చి మరీ తన మద్దతుదారులకు అభివాదం చేస్తూ విమర్శల పాలయ్యారు. కరోనా పాజిటివ్ తేలిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ప్రస్తుతం వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం స్వల్ప కోవిడ్ లక్షణాలతో హాస్పిటల్లో చేరిన ఆయన ఆదివారం తన అభిమానులను సర్ప్రైజ్ చేశారు. హాస్పిటల్ బయట వేచి చూస్తున్న తన మద్దతుదారులను పలకరించేందుకు ఓ యూఎస్యూవీ కారులో బయటకు వెళ్లారు. మాస్క్ ధరించిన ట్రంప్ తన అభిమానుల్ని కారులో నుంచి సంకేతాలతో పలుకరించారు. అయితే కోవిడ్ లక్షణాలతో ట్రంప్ కారులో బయటకు వెళ్లడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అలా చేయడం వల్ల ఆయన సిబ్బందికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాధి తీవ్రమైనదే అయినా.. ట్రంప్ మాత్రం ఫోటోషూట్ స్టయిల్లో హాస్పిటల్ బయట తిరగడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
అయితే ఆదివారం ట్రంప్‌కు ఇచ్చిన చికిత్సకు సంబంధించి డాక్టర్లు కొన్ని విషయాలను వెల్లడించారు. ట్రంప్ ఆక్సిజన్ లెవల్స్ తగ్గినట్లు డాక్టర్లు హెచ్చరించారు. రెండుసార్లు ఆయనకు ఆక్సిజన్ లెవల్స్ తగ్గాయి. స్టెరాయిడ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. కొద్దిగా ఆక్సిజన్ అందించినట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. అధ్యక్షుడు ఆరోగ్య పరిస్థితిపై గందరగోళం, ఆందోళనల నేపథ్యంలో ట్రంప్ వైద్య బృందంలోని కీలక సభ్యుడు, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పల్మనరీ నిపుణుడు బ్రియాన్ గారిబాల్డి ప్రకారం సోమవారం ఆయన ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఈ అంచనాల మధ్య ట్రంప్ సర్ప్రైజ్ ఔటింగ్ విమర్శలకు తావిచ్చింది.