బ్యాలెట్ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ ఎంసి) ఎఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఉధృతి అధికంగా ఉన్న నేపథ్యంలో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని మెజార్టీ పార్టీలు కూడా మొగ్గు చూపాయి. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు.
ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల కొరతే కారణమా?
బ్యాలెట్ వినియోగించినా.. ఈవీఎంలతో ఎన్నికలకు వెళ్లినా.. కరోనా వ్యాప్తి తీవ్రత అదే స్థాయిలో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈవీఎం అయితే బటన్ నొక్కాల్సి ఉంటుంది. బ్యాలెట్ అయినా… గుర్తులు ఉండే కాగితంపై స్టాంపు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఓటర్లందరూ ఒకే స్టాంప్ ముట్టుకోవాలి. ఈ క్రమంలో జాగ్రత్తలే ముఖ్యమని అధికారులంటున్నారు. వీవీ ప్యాట్‌లు అందుబాటులో లేకపోవడం వల్లే బ్యాలెట్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం రాసిన లేఖకు స్పందిస్తూ 26 పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. వీటిలో కేవలం 3 పార్టీలు మాత్రమే ఇవిఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరగా మిగతా పార్టీలన్నీ బ్యాలెట్ వైపే మొగ్గు చూపాయి. అన్ని విధాలా బ్యాలెట్‌కే అందరూ మొగ్గుచూపడంతో ఆ దిశగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది.