టివిజి: ఆ గుడిలో దళితులే అర్చకులు!

సాధారణంగా గుళ్లలో బ్రాహ్మణులే పూజారులుగా ఉంటారు. కానీ చుట్టూ ప‌చ్చ‌ని పంట పొలాల‌తో ఎంతో ఆహ్లాదంగా ఉంటే పశ్చిమ గోదావరిజిల్లా ఉండి మండలం ఉప్పులూరులోని ఓ ఆలయానికి మాత్రం దేశ వ్యాప్తంగా ప్ర‌త్యేక స్థానం.. ఎందుకంటే ఇక్క‌డ గుడిలో దళితులే పూజారులు. చైతన్యానికి మారు పేరుగా నిలిచిన ఈ గ్రామంలో విభిన్న మతాలు,సంప్రదాయాలు,కులాలు ఉన్నప్పటికీ అందరూ సమభావం, సోద‌ర భావంతో అంతా క‌లిసి అన్యోన్యంగా ఉంటారు. కుల వివక్షను శతాబ్దాల కిందటే తరిమికొట్టిన చైతన్యం ఉప్ప‌లూరు సమాజానిది. ఆ గ్రామ ప్రజల ఆరాధ్యదైవం చెన్నకేశవస్వామి. అక్కడి ప్రజలు ఆలయంలో అర్చకత్వ బాధ్యతలు దళితులకు అప్పగించడంతో, దేశంలోనే సామాజిక న్యాయం ఉన్న గ్రామంగా ఏనాడో గుర్తింపు పొందింది.

యర్రా వారి వంశీయుల దేవాలయం చరిత్ర ప్రసిధ్ధి. భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ దర్శించి పునీతులయ్యారు. ఉప్పులూరు పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం కు సమీపంలో ఉంది. ఈ గ్రామంలో యర్రా వంశీయులు జమిందారులు. వీరు కర్నాటకలో చెన్నకేశవ స్వామి దేవాలయం కూడా నిర్మించారు. మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, రాజ్యసభ సభ్యులుగా పని చేసిన యర్రా నారాయణ స్వామి స్వగ్రామం ఉప్పులూరు కావడం విశేషం. భారత రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ వ‌ద్ద‌ లక్నో న్యాయవాద విద్యను యర్రా నారాయ‌ణ‌స్వామి అభ్యసించారు. ఆ ప‌రిచ‌యంతో ఆయన రాజ్యసభ సభ్యులు గా ఉన్న కాలంలో రాష్ట్రప‌తి శంక‌ర్‌దాయ‌ళ్ శ‌ర్మ ఉప్పులూరు రావడం జరిగింది.

 

ఉప్పవూరు గ్రామంలో 12వ శతాబ్ధం నుండి కుల వివక్షత లేదు. పళ్ళాలలో దూపదీపనైవేద్యాలతో,నిత్యపూజలందుకునే చెన్నకేశవ స్వామి ఆలయంలో పల్నాటి యుద్ధసమయంలో దాడులు జరిగాయి. ఆలయంలోకి అడుగుపెట్టగానే వేదమంత్రాలు చెవులకు ఇంపుగా విన్పిస్తాయి. హరిజనులంతా సాక్షాత్తూ ఆ చెన్నకేశవ స్వామి కి ఎంతో ప్రీతి పాత్రులు. తిరు నారాయ‌ణ దాసు వార‌సులు 1280 ప్రాంతంలో ఈ గ్రామానికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. అప్ప‌టి నుంచి అర్చకులుగా వారే ఉన్నారు. ఎలాంటి వివక్షా ఉండదు ఈ గ్రామంలో. అన్ని కులాల వారు భక్తిభావంతో ఇక్కడికి వస్తుంటారు. అర్చకుల పాదాలకు కూడా నమస్కరిస్తారు. 1868లో ఈ ఆలయ విగ్రహాన్ని చెన్నకేశవస్వామిగా రామాజనుజాచార్యులు నిర్థారించారు.

అప్ప‌టి వ‌ర‌కూ అప్ప‌ల‌స్వామిగా పిలిచే స్వామిని చెన్నకేశ‌వ స్వామిగా పేర్కొంటూ 1893లో నూజివీడు జమీందార్‌ రాజా పార్థసారథి అప్పారావు 40 ఎకరాలను కేటాయించారు. ప్ర‌స్తుతం 25 ఎకరాల్లో అర్చక కుటుంబాలు సాగు చేసుకొని జీవనోపాధి పొంద‌ుతున్నారు. మ‌రో 13 ఎకరాలు ఆలయాభివృద్ధికి, రెండెకరాలు భజంత్రీలకు కేటాయింపులున్నాయి.

1784లోనే ఈ ఆలయానికి తొలి ధర్మకర్తల మండలి ఏర్పాటయ్యింది. వంద‌ల ఏళ్ల నాడే వివ‌క్ష‌కు చోటు లేకుండా చేసిన చ‌రిత్ర ఉంది”ఇప్ప‌టి వ‌ర‌కూ 11 త‌రాలుగా దేవుని అర్చ‌క‌త్వంలో ఉన్నారు.బ్రహ్మనాయుడి సేనాపతి కన్నమదాసుకు వారసులు వీరు.ప్ర‌తి కుటుంబం నుంచి ఒక్కొక్క‌రు చొప్పున 9 కుటుంబాల‌కు చెందిన వారు అర్చ‌క బాధ్య‌త‌లు చూస్తుంటాం. పౌర్ణ‌మి నుంచి పౌర్ణ‌మి వ‌ర‌కూ నెల‌కు ఒక‌రు చొప్పున బాధ్య‌త‌లు చూస్తాం. వైశాఖం, ధ‌నుర్మాసాల‌లో అంద‌రం క‌లిసి స్వామి వారి సేవ‌లు చేస్తాం. అన్ని కులాల వారు భ‌క్తిభావంతో ఆల‌యానికి వ‌స్తారు. అంద‌రినీ స‌మానంగా చూస్తారు. ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా మా సామాజిక నేప‌థ్యంతో సంబంధం లేకుండా ప్రాధాన్య‌మిస్తారు. ఆర్చ‌క‌త్వంలో ఉన్న వారంద‌రం వివిధ ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో ఉన్నాం. వీరి లో ఉపాధ్యాయుడిగా ప‌నిచేస్తున్న వారున్నారు. బ్యాంకు మేనేజ‌ర్లు, సీఆర్పీఎఫ్, పోలీస్ శాఖ‌లో ప‌నిచేస్తున్న వారు కూడా ఉన్నారు. ఎంత దూరంలో ఉన్నా ఆలయంలో అర్చకత్వం కోసం వస్తాం” అని హరిదాసులు వివరించారు.

 

ర‌ఘువంశం, కుమార సంభవం, శబ్దమంజరి, అమరకోశం, మేఘదూతం, శిశు పాలవధ వంటి కావ్యాలు.. ప్రాచీన గ్రంథాల్లోని సంస్కృత శ్లోకాలు పఠించే విద్యను తమ పూర్వీకులు సొంతం చేసుకున్నారని.. వారి నుంచి తాము నేర్చుకున్నామని ప్రధాన అర్చకుడు కృష్ణ కేశవదాసు తెలిపారు. సుప్రభాత సేవతో పాటు తిరుప్పల్లాణ్డు, తిరుపళ్లియెళుచ్చి, తిరుప్పావై చదువుతూ పూజలు చేస్తున్నారు.ప‌ల్నాడు యుద్ధంలో కీలక పాత్ర పోషించిన బ్ర‌హ్మ‌నాయుడి అనుచ‌రుడిగా పేరున్న క‌న్న‌మ‌దాసుకి అప్ప‌ట్లో అర్చ‌క‌త్వం అప్ప‌గించారు.

మలిదేవరాజు తరఫున బ్ర‌హ్మ‌నాయుడు పోరాడారు. విశిష్టాద్వైత సిద్దాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన రామానుజాచార్యుల స్ఫూర్తితో సంస్కరణశీలిగా మారిన బ్ర‌హ్మ‌నాయుడు సమభావాన్ని పెంచడానికి చాపకూళ్ల పేరుతో అన్ని కులాల వారికి సహపంక్తి భోజనాలు పెట్టేవార‌ని ప్ర‌చారంలో ఉంది.

ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న క‌న్న‌మ‌దాసుకి మాచర్ల, మార్కాపురంలో చెన్న కేశవస్వామి ఆలయాల అర్చక బాధ్యతలను బ్ర‌హ్మ‌నాయుడు అప్పగించారు. ఆ త‌ర్వాత క‌న్న‌మ‌దాసు వారసుడు తిరువీధి నారాయ‌ణ‌దాసు ప‌ల్నాడు యుద్ధం కార‌ణంగా వ‌ల‌సపోయిన‌ట్టు ఆలయ చ‌రిత్ర చెబుతోంది.

అలా నారాయ‌ణదాసు సింహ‌చ‌లం చేరుకుని, కొన్నాళ్లు అక్క‌డి ఆల‌యంలో ఆశ్ర‌యం పొంది, మ‌ళ్లీ ప‌ల్నాడు చేరుకునే క్ర‌మంలో ఉప్పులూరు వ‌చ్చిన‌ట్టు ఆల‌య చరిత్ర‌లో ఉంది. మంత్రోచ్చారణ బ్రాహ్మణపండితులది కాదు.దళితపండితులది.ఆ స్వామివారికి నిత్యనైవేద్య ధూపదీపాలు వీరే నిర్వహిస్తారు.

-టి.వి.గోవిందరావు

Leave A Reply

Your email address will not be published.