1.10 క్లో లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో
సహకరించిన మరో ముగ్గురు కూడా అదుపులోకి..

1.10 క్లో లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో
సహకరించిన మరో ముగ్గురు కూడా అదుపులోకి..
మేడ్చల్ : కుక్కతోక వంకర లాగ.. అక్రమ సంపాదనకు అవాటు పడిన వారు ఎప్పటికీ మారరు.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అలాంటి వారిలో మార్పు శూన్యం. కొంతమంది అధికారులు మాత్రం తీరు అస్సలు మార్చుకోవడంలేదు. అక్రమ డబ్బు సంపాదనకు అలవాటు పడ్డ ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీ చేతికి చిక్కాడు. మేడ్చల్ జిల్లా కీసర ఎమ్వార్వో నాగరాజు కోటీ పది లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారుల కంటపడ్డాడు. ఇతనిపై ఇదివరేక పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఉండటంతో నాగరాజు ఇంట్లో అధికారులు ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే ఎమ్మార్వో పై గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే… భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడం కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన సర్వే నంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తున్నట్టు సమా చారం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఓ వర్గానికి అనుకూలంగా రికార్డులు తయారుచేయడానికి తహసీల్దార్ రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఎస్రావు నగర్‌లోని తన ఇంటివద్ద మొదటి విడతగా రూ.కోటీ 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపల్లి దాయర గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, వరంగల్‌కు చెం దిన శ్రీనాథ్ యాదవ్‌తోపాటు రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ తహసీల్దార్‌కు సహకరించినట్లు సమాచారం. ఈ ముగ్గురినీ కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుతోపాటు ఆయన బంధు వుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
తొలినుంచీ అవినీతి ఆరోపణలే..
తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.