తాగునీటి సరఫరాలో ఆటంకాలు ఉండొద్దు
జలమండలి అధికారులతో జలమండలి ఎండీ దానకిశోర్ సమీక్ష

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంతో పాటు ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలకు సరిపడా తాగునీరు అందుబాటులో ఉందని, ప్రణాళికబద్ధంగా సరఫరా చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు.
ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఓ ఆండ్ ఎం డివిజన్ 1, 2ఏ, 2బీ, 3కి సంబంధించిన అధికారులతో నీటి సరఫరాపైన సమీక్ష నిర్వహించారు. కాగా, డివిజన్ల వారీగా జరుగుతున్న ఈ సమీక్ష సమావేశాలు ఇతర డివిజన్ల అధికారులతో రేపు కూడా కొనసాగుతాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా నీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలని పేర్కొన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో లోప్రెషర్, తదితర సమస్యలు లేకుండా సరైన ప్రెషర్‌లో నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. నీరు వృధా కాకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్న నేపథ్యంలో జలమండలి చేపట్టాల్సిన ప్రణాళికలను సెక్షన్లవారీగా సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 25వ తేదీ నుంచి భద్రతా వారోత్సవాలు చేపట్టనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్నప్పుడు కార్మికులు, సిబ్బంది తీసుకోవాల్సిన రక్షణ చర్యల గురించి, రక్షణ పరికరాల వినియోగం, తదితర అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జలమండలి రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు, ట్రాన్స్‌మిషన్ అధికారులు పాల్గొన్నారు.