12, 13 తేదీల్లో అసెంబ్లీ?
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు మరికొన్ని అంశాలపై చర్చించేందుకు 2 రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక భేటీ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమ, మంగళవారాల్లో జరిగే ఈ సమావేశాల నిర్వహ ణకు సంబంధించి శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. సమావేశాల నిర్వహణ తీరు, ఎజెండాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ చట్టంలో పేర్కొన్న విధంగా గ్రేటర్ ఎన్నికల్లోనూ ఇద్దరి కంటే ఎక్కువమంది సంతానం కలిగినవారు కూడా పోటీ చేసే అంశంపై చట్టసవరణ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఎల్ఆర్ఎస్, జీవో 58, 59కు సంబం ధించి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎల్ఆర్ఎస్ ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం ఈ సమావేశాల్లో ప్రకటన చేసే అవకాశముంది.
పలు కీలకమైన బిల్లులతోపాటు ముఖ్యమైన అంశాలపై గత నెల 6 నుంచి 16 వరకు అసెంబ్లీ సమా వేశాలు జరిగాయి. అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసినప్పటికీ, ప్రోరోగ్ చేయలేదు కాబట్టి ఎపుడైనా తిరిగి ప్రారంభించుకోవచ్చు. దీనిపై ప్రభుత్వం శుక్రవారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.