పెద్ద‌ప‌ల్లిలో 75 మీటర్ల త్రివ‌ర్ణ ప‌తాక‌ ర్యాలీ

దారి పొడుగునా రెపరెపలాడిన జాతీయ జెండాలు

పెద్ద‌ప‌ల్లి (CLiC2NEWS): ప‌ట్ట‌ణంలోనిలోని వీధుల‌న్నీ త్రివ‌ర్ణ ప‌తాకాలతో, దేశభక్తి నినాదాలతో మార్మోగినవి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం 75 మీటర్ల జాతీయ పతాకం తో భారీ ఫ్రీడం ర్యాలీ నిర్వ‌హించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎల్లమ్మ చెరువు వరకు కొనసాగిన ర్యాలీ ఉత్సాహభరితంగా సాగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ..

నేటి యువతరం జాతీయ నాయకుల పోరాటాలను గుర్తెరిగి, వారి త్యాగాల ఫలితంగా సిద్ధించిన దేశ స్వాతం త్య్ర‌ ప్రాముఖ్యతను ఇనుమడింపజేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గుండెల నిండా దేశ భక్తిని నింపుకుని విద్యార్థులు, యువతీ యువకులు మొదలు వృద్దుల వరకు కదంకదం కలుపుతూ ర్యాలీలో పాల్గొనడం జాతీయ సమైక్యతకు అద్దంపట్టింద‌ని అన్నారు.

జిల్లాలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్ సి సి, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, ఏడవ బెటాలియన్ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థిని విద్యార్థులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆర్మీ అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కార్య‌క్ర‌మంలో స్వాతంత్య్ర ప్రాముఖ్య‌త‌ను, భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతూ సాంస్కృతిక కళాకారులు వీనుల విందుగా దేశభక్తి గేయాలు ఆలపించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఇంఛార్జి డి. సి.పి. రూపేష్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, పెద్దపల్లి ఏసిపి సారంగపాని  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.