భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్య
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/husband-commit-suicide.jpg)
కళ్యాణదుర్గం (CLiC2NEWS): వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండు రోజుల క్రితం భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గగనశ్రీ, గణేష్ రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేదు. వారికి తెలియకుండా ఐదు నెలల నుండి గగనశ్రీ భర్తతో కలిసి ఉంటుంది. ఈ నెలలో ఆమెకు జ్వరం రావడంతో అనంతపురంలోని ఆస్రత్రికి తీసుకెళ్లారు. అక్కడ గగనశ్రీని పరీక్షించిన వైద్యులు డెంగీ జ్వరం అని నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్తుండగా ఆమె మృతి చెందింది. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి. తమ కుమార్తెను భర్త, అత్తమామలే చంపారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్య చివరి చూపు కూడా చూడనీయలేదని, తన భార్యను తనే హత్యచేశానాని కేసు నమోదు చేశారని.. తన భార్య లేని జీవితం వ్యర్థమనుకున్న గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.