పండగ ధమాకాలో నిజమెంత?
బోనాంజా అంటూ ప్రజలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వ్యతిరేకత తీసుకు వస్తున్నారు.: విశ్రాంత తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు టి.పుల్లేశ్వరరావు
కాకినాడ: ‘కేంద్ర ఉద్యోగులకు బొనాంజా’ అంటూ రెండు ప్రధాన దినపత్రికలు మొదటి పేజిలో ప్రముఖంగా ప్రచురించడంతో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఏదో మేలు చేసిందని అందరూ భావిస్తారని అయితే వీటి వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతమాత్రం మేలు చేకూరదని విశ్రాంత తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు టి.పుల్లేశ్వరరావు పేర్కొన్నారు. ఉద్యోగులకు కేంద్ర సర్కార్ ప్రకటించింన ప్యాకేజీపై బుధవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారంనాడు ప్రకటించిన ప్యాకేజిన, అందులో ఉద్యోగులకిచ్చే ఎల్‌టిసి ఎన్‌క్యాష్‌మెంట్, పండుగ అడ్వాన్సు గురించి మీడియాలో ఇలా రాయడం, ముఖ్యంగా శీర్షికలు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన తమ విస్మయం వ్యక్తం చేశారు.
పలు పత్రికలు ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్’, ‘దసరా కానుక’ వంటి శీర్షికలతో ప్రచురించాయని ఆయన అన్నారు. కానీ నిజానికి ఆ ప్యాకేజి అనేక విషమ షరతులతో కూడుకుంది. ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వచ్చేది లేదన్నారు. పైపెచ్చు భ్రమలు కల్పించి, వారి చేతి చమురు వదిలించే కుట్ర ఇది అని పుల్లేశ్వరరావు వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి ప్రకటించిన ప్యాకేజి వివరాలు ఒకేసారి పరిశీలిస్తే…..
నాలుగేళ్ల శ్లాబులో ఒకసారి దేశంలోని ఏదైనా ప్రదేశానికి, మరోసారి ఉద్యోగి సొంతూరికి కుటుంబ సభ్యులందరూ వెళ్లేందుకు వీలుగా ఎల్‌టిసి సౌకర్యం కల్పించబడింది. అలాగే ఆ సందర్భంలోనే సదరు ఉద్యోగి ఖాతాలో ఆర్జిత సెలవు ఉంటే వాటిలో పది రోజులకు లీవ్ ఎన్క్యాష్మెంటు కింద నగదు చెల్లిస్తారు. కొన్ని దశాబ్దాలుగా ఉన్న సౌకర్యాలివి.
అయితే కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగులు ప్రయాణాలు చేయడానికి అంత సుముఖంగా లేరు కనుక ఈ మొత్తాలకు సమానమైన ఓచర్లు ఇస్తామని మంత్రి ప్రకటించారు. అంతవరకూ అయితే అది బాగానే ఉండేది.
కాని, ఆ ఓచర్లను ఖర్చు చేయడానికే మంత్రి చాలా పితలాటకం పెట్టారు. ప్రయాణ టిక్కెట్ల నిమిత్తం ఉద్యోగికి చెల్లించే మొత్తానికి మూడింతలు, లీవ్ ఎన్క్యాష్మెంటు సొమ్ముకు రెట్టింపు ఖర్చు పెట్టాలన్నది ఆ షరతు విధించారని ఆయన తెలిపారు.
ఉదాహరణకు ఒక ఉద్యోగి కుటుంబ సభ్యుల ప్రయాణ టిక్కెట్లకు రూ.80,000, లీవ్ ఎన్క్యాష్మెంటు రూ.20,000 వచ్చిందనుకుందాం. ఉద్యోగికి లక్ష రూపాయల ఓచర్లు జారీ చేస్తారు.
మంత్రి నిర్మలమ్మ లెక్క ప్రకారం.. ఆ ఉద్యోగి వాటిని వాడుకోవాలంటే టిక్కెట్లకు మూడింతలు అంటే 2,40,000, ఎన్‌క్యాష్‌మెంట్‌కు రెట్టింపు రూ.40,000, వెరసి రూ.2,80,000 విలువ చేసే సరుకులు, సేవలు కొనుగోలు చేయాలి. అది కూడా 12 శాతం లేదా అంతకన్నా ఎక్కువ జిఎస్టి రేటున్న వాటినే కొనాలి. ఆ మేరకు జిఎస్టి అధీకృత రసీదును జతపర్చాలని ఆయన వివరించారు.
అంటే ప్రభుత్వం ఉద్యోగులకిచ్చే మొత్తంలో కనీసం మూడో వంతు మొత్తం తిరిగి ఖజానాలకు చేరుతుందన్నారు. పై ఉదాహరణనే తీసుకుంటే సర్కారు ఇచ్చే ఎల్‌టిసి ఓచర్ లక్ష రూపాయలైతే జిఎస్టి రూపంలో రూ.33,600 లేదా అంతకన్నా ఎక్కువ మొత్తం ఖజానాలకు చేరుతుంది. అసలు కిటుకు ఇదీ ఆయన వ్యాఖ్యానించారు. ఇన్ని షరతులు విధించి, దాన్నేదో బొనాంజా, కానుక అంటే ఎలా అన్న ఉద్యోగుల ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు ? అని ఆయన ప్రశ్నించారు.
కోవిడ్ నేపథ్యంలో జనం దగ్గర డబ్బు లేదని, వారికి నగదు బదిలీ ద్వారా మార్కెట్లో డిమాండ్ పెంచితేనే ఆర్థిక వ్యవస్థకు ఊతం కల్పించడం సాధ్యమని అందరూ చెబుతుంటే ‘మేం రూపాయి ఇస్తాం, మీరు మూడు రూపాయలు ఖర్చు చేయండి’ అని ప్రభుత్వం చెప్పడం మోసగించడం కాదా? ఆయన నిలదీశారు.అయితే, వస్తువుల కొనుగోలు పట్ల వ్యామోహం పెంచే కన్స్యూమరిజం మన సమాజంలో బాగానే ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కూడా చాలా కాలంగా కొనాలనుకుంటున్న వస్తువుల కొనుగోలుకు దీన్ని ఒక అవకాశంగా భావించవచ్చునన్నారు. ఇది ‘మంటను చూసిన మిడత’ చందంగా నష్టపోయేదే అయినా గాని ఇలాంటి పరిస్థితి రాదని చెప్పలేమన్నారు..
ప్రభుత్వం, పారిశ్రామిక, వాణిజ్య రంగాలూ అలాంటి ఆశ పెట్టుకొని ఉండవచ్చు. కాని, జనం జేబులకు చిల్లులు పడి, ఉన్న పొదుపు సొమ్ము కూడా హరించుకుపోయిన నేపథ్యంలో అది కూడా నెరవేరదు అని ఆయన తెలిపారు.
పండుగ అడ్వాన్సుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పది వేల రూపాయలు చెల్లిస్తామని, అది కూడా రూపే కార్డు రూపంలో ఇస్తామని మంత్రి ప్రకటించారు. (ఇప్పుడు కూడా నాన్ ఎగ్జిక్యూటివ్స్ కి రూ.5000 పండుగ అడ్వాన్స్ గా నగదు ఇస్తున్నారుగా.) నగదుగా విత్‌డ్రా చేయడానికి వీలు లేకపోవడం తప్ప ఆ సొమ్ము ఖర్చుపై మాత్రం షరతులు విధించలేదు. అయితే, ఇదేమీ ఉచితం కాదు. ఉద్యోగులు పది వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సిందే ! వీటిలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా కల్పించిన రాయితీ ఏమాత్రమూ లేదన్నారు. ఎల్‌టిసి ఉద్యోగుల హక్కు. దానికి బడ్జెట్లో కేటాయింపూ ఉంది.
అడ్వాన్సు మొత్తం తిరిగి చెల్లించేదే ! ఇక ఏం బొనాంజా? ఎలాంటి కానుక ? కేంద్రం ఇచ్చిన బంపరాఫర్ ఏమిటి? అనేది ఆలోచించాలని పుల్లేశ్వరరావు కోరారు. ఇటువంటి తప్పుడు విధానాలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మోసగించరాదని ఆయన తెలిపారు.