నేలమట్టమైన సర్దార్ సర్వాయి పాపన్న కోట
వరంగల్ : రాష్ట్రంలో కురిసిన కుండపోత వర్షాలకు పాత ఇళ్లు, పురాతన భవనాలు కూలిపోతున్నాయి. ఎడతెరిపిలేని వానలతో రాజధాని హైదరాబాద్ అతలాకుతలమయిన విషయం తెలిసిందే.. దాదాపు 30 పాతభవనాలు, గోడలు కూలిపోయాయి. 18వ శతాబ్దంలో రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న కట్టిన కోట నేలమట్టం అయ్యింది. దీంతో కోట కింద నాలుగు ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదాన్ని ముందే గమనించిన స్థానికులు ఇంట్లో నుంచి బయటికి పరుగులు తీశారు. దీంతో ఎవరికి ఏ ప్రాణ నష్టం జరుగలేదు. దీంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ కోటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతంగా ప్రకటించి,4 కోట్ల 50 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ నిధులు ఆచరణలో కోట అభివృద్ధికి నోచుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురాతన కోట భారీ వర్షాలకు కూలిన సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఖిలాషాపూర్ కోట ఈ గ్రామానికి ఎంతో గుర్తింపు తెచ్చిందని, అలాంటి కోట నేలమట్టం కావడంతో పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.