Khammam: సకల సౌకర్యాలతో అతిపెద్ద సమీకృత మార్కెట్
గజ్వేల్ తర్వాత ఖమ్మంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్

ఖమ్మం (CLiC2NEWS): ఖమ్మం పట్టణంలో సకల సౌకర్యాలతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్‌ను నిర్మించారు. గురువారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టణంలోని వీడీఓస్ కాలనీలో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న మహిళలతో మాట్లాడారు. మార్కెట్‌లో విక్రయిస్తున్న కూరగాయలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కొత్త మార్కెట్ లో సౌకర్యాలపై మంత్రి ఆరా తీశారు. మార్కెట్‌లో పార్కింగ్ సౌకర్యంపై పురపాలక శాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం స్వయంగా కూరగాయలను కొనుగోలు చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం పట్టణ వాసులకు తాజా కూరగాయలను తగి ధరలకు అందించాలనే ఉద్దేశ్యంతో మార్కెట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మార్కెట్ రాష్ట్రంలో రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా సమీకృత మార్కెట్‌ను ప్రారంభింపజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగర పాలక కమీషనర్, పలువురు నాయకులు పాల్గొన్నారు.