దారుణం.. 12 గంటలు పని, ఒక పూట భోజనం..
కూలీలను కట్టేసి వెట్టిచాకిరీ చేయించుకుంటున్న కాంట్రాక్టర్లు అరెస్టు

కొన్ని సినిమాలలో ఇలాంటి సీన్లు చూస్తుంటాం. యజమానులు.. కూలీలకు సరైన వసతులు, భోజనం లేకుండా వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటారు. వారిని కొట్టడం.. కూలీ డబ్బులు కూడా ఇవ్వకుండా హింసిస్తుంటారు. వారిలో ఎవరో ఒకరు ఎలాగోలా తప్పించుకుని పారిపోయి బయట వారికి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సరిగ్గా అటువంటి ఘటనే మహారాష్ట్రలోని ఉస్మాబాద్‌లో వెలుగు చూసింది. పోలీసులు చొరవతో 12 మంది కూలీలకు వెట్టిచాకిరీ నుండి విముక్తి కలిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బావులు తవ్వకానికి వచ్చిన 12 మంది కూలీలతో సంతోశ్‌యాదవ్, కృష్ణ శిండే అనే కాంట్రాక్టర్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారిని గొలుసులతో బంధించి.. రోజుకు 12 గంటలు పని చేయించేవారు . వారికి ఒకసారి మాత్రమే భోజనం పెట్టేవారు. మల మూత్ర విసర్జనకు కూడా పోనివ్వకుండా హింసించినట్లు సమాచారం.. బంధీలుగా ఉంచి బావులు తవ్వించి.. ఒక్క రూపాయి కూడా కూలీ ఇవ్వలేదు. ఆ కూలీల్లో ఒకరు తప్పించుకుని పోయి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిగిలిన 11 మంది కూలీలను విడిపించి వైద్యం కోసం తరలించారు. ఇద్దరు కాంట్రాక్టర్లతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు.