బీసీలను గుర్తించింది జగన్ మాత్రమే..
తోట త్రిమూర్తులు వెల్లడి

మండపేట: రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 56 బీసీ కార్పొరేషన్ లకు చైర్మెన్ లు, డైరెక్టర్లను ఎంపిక చేయడం ద్వారా వందలాది పదవులు బీసీలకు ఇచ్చినట్టు అయిందని అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మండపేట అసెంబ్లీ ఇన్ చార్జి తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ముమ్మిడి వరపు బాపిరాజు అధ్యక్షతన జరిగిన బీసీ నాయకుల అభినందన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల్లో అణగారిన వర్గాల వారికి, ఇతరులకు, 20 వేల జనాభా ఉన్న బీసీలకు, 56 కులాల వారికి 56 కార్పొరేషన్లు ఎంపిక చేసి ఆయా కులాల సంఘ సభ్యులను అధ్యక్షులుగా ప్రకటించడం బీసీలకు చరిత్రలో మహోపకారం చేసినట్లు అయిందన్నారు. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో బీసీలు ప్రస్తుతం చేపట్టిన పథకాల ద్వారా లబ్ది పొందుతారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఇటువంటి కార్యక్రమం చేయడం బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఆనందదాయకంగా ఉందన్నారు. బడ్జెట్లో 45 వేల కోట్ల రూపాయలు సంక్షేమ నిధులు సంక్షేమానికి కేటాయించడం ఎంతో ఆనందదాయకం అన్నారు. బీసీలు అందరూ ఐకమత్యంగా ఉండాలని సంఘటితంగా ఉండి ప్రభుత్వపరంగా రావాల్సిన పథకాలు రాయితీలు తెచ్చుకోవలసిన బాధ్యత కార్పొరేషన్ డైరెక్టర్ లపై ఉందన్నారు. మండపేట నుండి జంగమ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రముఖ బీసీ నాయకుడు మీగడ శ్రీనివాస్, అదేవిధంగా షేక్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా షేక్ అలీ ఖాన్ బాబాలను ఎంపిక చేసి ఇద్దరికీ డైరెక్టర్ లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా అరుదైన విషయం అన్నారు. వీరిరువురూ తమ తమ పరిధిలో తమ కులాల వారికి వైయస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది సమీక్షించాలి అన్నారు. అందని వారికి తమ తమ కార్పొరేషన్ ద్వారా సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దేశ చరిత్ర లో ఇన్ని కులాలకు కార్పొరేషన్ లు ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్సార్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో నివసించే ప్రజలు అందరికీ వైఎస్ఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నియోజకవర్గంలో బీసీలకు రాష్ట్రస్థాయిలో ఇద్దరు డైరెక్టర్లను నియమించినందుకు ముఖ్యమంత్రికి త్రిమూర్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైయస్సార్ పార్టీ కార్యాలయం నుండి పట్టణ పురవీధుల్లో డైరెక్టర్లను ఊరేగింపుగా కార్యకర్తలు తీసుకొచ్చారు. తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో వేగుళ్ళ పట్టాభిరామయ్య చౌదరి, కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు, చిట్టూరి సతీష్ , పిల్లా వీరబాబు, వల్లూరి రామకృష్ణ, జిన్నూరి సత్యసాయిబాబా, పెంకే గంగాధరం, గంగుమళ్ల శ్రీనివాస్ (అయ్యప్పా ట్రాన్స్ పోర్ట్), సయ్యద్ రబ్బాని, టి పల్లేశ్వరరావు, పోతంశెట్టి ప్రసాద్, అధికారి శ్రీనివాస్, కొమ్ము రాంబాబు, మాలసాని సీతామహాలక్ష్మి తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జగన్ చిత్రపటానికి పాలాభిషేకం..
ఇదిలా ఉండగా బీసీలను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి నియోజకవర్గ ఇన్చార్జి తోట త్రిమూర్తులు తదితరులు పాలాభిషేకం చేశారు. తొలుత రాజరత్న సెంటర్ కు ఊరేగింపుగా వచ్చి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమం అత్యంత కోలాహలంగా జరిగింది. అనంతరం అభిమానుల మధ్య తోట త్రిమూర్తులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో బీసీ నాయకులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.