స్కూలు బస్సు బోల్తా.. 10 మందివిద్యార్థులకు స్వల్ప గాయాలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/08/School-bus.jpg)
మహబూబాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని దంతాలపల్లి మండలంలో ఓ ప్రయివేటు స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలు అయ్యాయి. మండలంలోని బొడ్లాడ శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొర్రూరులోని ఓ ప్రయివేటు పాఠశాలకు చెందిన బస్సు బుధవారం దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం నుంచి విద్యార్థులతో బయలుదేరింది. పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, దంతాపల్లికి చెందిన దాదాపు 42 మంది విద్యార్థులతో బొడ్డాల గ్రామం మీదుగా వెళ్తోన్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకు వెళ్లి బోల్తా పడింది. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులోంచి బయటి తీసి.. గాయపడిన వారిని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి వచ్చి వారి పిల్లలను ఇంటికి తీసుకు వెళ్లారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.