వీసా నిబంధ‌న‌లు స‌డ‌లించిన కేంద్రం

హైద‌రాబాద్‌: కేంద్ర ప్ర‌భుత్వం గురువారం వీసా నిబంధ‌న‌ల‌ను స‌డ‌లిస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీంతో అన్ని వ‌ర్గాల‌ విదేశీయులు భార‌త్‌లోకి ప్ర‌వేశించేందుకు అనుమ‌తి ఇచ్చారు. అయితే ప‌ర్యాట‌కం కోసం భార‌త్‌లో విజిట్ చేసేందుకు విదేశీయుల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఓసీఐ, పీఐఓ కార్డులు ఉన్న‌వారితో పాటు విదేశీయుల‌కు ఈ అవ‌కాశం క‌ల్పించారు. చట్టబద్ధమైన ఎయిర్‌పోర్టులు, సీపోర్టు చెక్‌పోస్టుల గుండా వాయు, జల మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అయితే టూరిస్టు వీసా కింద దేశానికి వచ్చే ప్రయాణీకులకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర హోంశాఖ ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. భార‌తీయుల‌తో పాటు విదేశీయుల‌కు కూడా ప్ర‌యాణ ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు తెలిపారు. పౌర విమాన‌యాన‌శాఖ ఆమోదించిన విమానాల‌కు మాత్ర‌మే ఈ ఆంక్ష‌లు వ‌ర్తించ‌నున్నాయి. కోవిడ్ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య‌శాఖ జారీ చేసిన నిబంధ‌న‌లను క‌చ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎల‌క్ట్రానిక్‌, టూరిస్ట్‌, మెడిక‌ల్ వీసాలు త‌ప్ప ఇత‌ర అన్ని వీసాల‌ను పున‌రుద్ద‌రిస్తున్న‌ట్లు భార‌త ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. తాజా ఆదేశాల‌తో… బిజినెస్‌, కాన్ఫ‌రెన్స్‌, ఉద్యోగం, విద్య‌, ప‌రిశోధ‌న‌, వైద్య సంబంధిత విష‌యాలకు హాజ‌ర‌య్యేందుకు విదేశీయుల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఒకవేళ ఆ వీసాల గడువు తేదీ గనుక ముగిసినట్లయితే, తాజా దరఖాస్తులతో మళ్లీ వీసా పొందవచ్చని పేర్కొంది. ఇక వైద్య చికిత్స కోసం భారత్‌కు రావాలనుకున్న విదేశీయులు మెడికల్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

Leave A Reply

Your email address will not be published.