ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

విశాఖపట్టణం: సరదగా ఈతకు వెళ్లిన విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. ఈ సంఘటన ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మారేడుపూడి పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన భారీవర్షాలకు మరేడుపూడి పరిసర ప్రాంతాల్లోని క్వారీలో భారీగా నీరు చేరింది. దాంతో ఆ చుట్టుపక్కల్లో ఉండే అక్కిరెడ్డిపాలెం తారక రామ్ కాలనీకి చెందిన ఎంపియుపి పాఠశాల విద్యార్థులు ఐదుగురు ఈత కోసం వెళ్లారు. వీరిలో ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు విద్యార్థులు గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయం తెలిపారు. కుటుంబసభ్యులు, కాలనీవాసులు వచ్చచూసే సరికి ముగ్గురు మృతిచెందారు. మృతులు నందనవనం చంద్ర (12), పొడుగు గిరీష్ (12), నీలకాయల బాలాజీ (12)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. మృతులను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.